ఈ పయనం.. ఇలా పదిలం
మెట్రో మార్గదర్శి మీ కోసం..
ఈనాడు, హైదరాబాద్‌
రాజేశ్‌ బాచుపల్లిలోని ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అమ్మానాన్నలతో కలిసి ఎల్‌బీనగర్‌లో నివాసం. ఇక్కడి నుంచి నిత్యం బస్సులో ఉద్యోగానికి వెళుతున్నాడు. దాదాపు గంట 50 నిమిషాలు ప్రయాణించి మియాపూర్‌ చేరుకుని అక్కడి నుంచి కంపెనీ బస్సులో వెళుతున్నాడు. మొత్తం 2 గంటలకు పైగా ట్రాఫిక్‌లోనే సమయం వృథా అవుతోందని వాపోయినా చేసేది లేక రాకపోకలు సాగిస్తున్నాడు. సుదీర్ఘ ప్రయాణం కావడంతో సరిగ్గా ఉదయాహారం తీసుకోకుండానే బయలుదేరి.. కార్యాలయానికి చేరేసరికి బాగా అలసిపోయేవాడు. కాస్త ఆలస్యంగా బయలుదేరితే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయేవాడు. మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే మెట్రోతో రాజేశ్‌ లాంటి ఉద్యోగుల ప్రయాణ కష్టాలు చాలా వరకు తీరనున్నాయి. ప్రయాణ సమయం సగానికి సగం ఆదా కానుంది. ప్రస్తుతానికి నేరుగా ఎల్‌బీనగర్‌ నుంచి మియాపూర్‌ వరకు మెట్రో లేకపోయినా.. 5 కిలోమీటర్ల దూరంలోని నాగోల్‌కు 10 నిమిషాల్లో చేరుకుని అక్కడి నుంచి మెట్రో ఎక్కవచ్చు. నేరుగా అయితే 45 నిమిషాల్లో గమ్యస్థానంలో ఉండొచ్చు..

ప్రస్తుతం అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌ వద్ద దిగి.. మరో మెట్రో ఎక్కాల్సి ఉండటంతో గంట సమయం పడుతుంది. పూర్తిగా ఏసీ ప్రయాణం.. ట్రాఫిక్‌ జాం దిగులు లేదు. ఒక బస్సు వెళ్లిపోతే మరో బస్సు ఎప్పుడు వస్తుందనే ఆందోళన ఉండొచ్చు. ఒక మెట్రో వెళ్లగానే మరో మెట్రో వెంటనే సిద్ధంగా ఉంటుంది. ఎక్కడ ఉంటుందో సమాచారం తెలుస్తుంది కాబట్టి కచ్చితంగా అనుకున్న సమయానికి గమ్యస్థానం చేరుకోవచ్చు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రాత్రి 8 గంటలకు రైలు అంటే సాయంత్రం 4 గంటలకే ఇంటి నుంచి బయలుదేరాల్సిన పనిలేదు. 6.30 ప్రాంతంలో మెట్రో ఎక్కినా రైలు బయలుదేరడానికి కంటే ముందే స్టేషన్‌కు చేరుకుంటారు. మియాపూర్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉంటూ నాగార్జునసాగర్‌ రోడ్డులో ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలకు వెళ్లే విద్యార్థి సైతం ఇక్కడి నుంచి బస్సులో గంటల తరబడి ప్రయాణం చేయాల్సిన పని లేదు. మియాపూర్‌లో ఎక్కి నాగోల్‌లో దిగి.. అక్కడ కళాశాల బస్సు ఎక్కితే త్వరగా కళాశాలకు చేరుకోవచ్చు. మెట్రోతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళల కష్టాలు చాలావరకు తీరనున్నాయి.

 

ప్లాట్‌ఫాం పైన…
మెట్లు, ఎస్కలేటర్లు ఉన్నచోట ప్లాట్‌ఫాం చిన్నగా ఉన్నా.. మిగతా ప్రాంతం విశాలంగానే ఉంది. దాదాపు 140 మీటర్ల పొడవు, వెడల్పు 10 అడుగుల వరకు ఉంటుంది. ఒక్కోవైపు వంద మందికి పైగా నిలబడొచ్చు.
మెట్రో వెళ్లిపోతుందని తోసుకోవద్దు. 20 సెకన్లే ఆగినా.. ప్రతి కార్‌కు రెండువైపులా విశాలమైన ద్వారాలు ఉన్నాయి. ఎంతమంది ఉన్నా క్షణాల్లో లోపలికి చేరుకోవచ్చు. తలుపులు ఆటోమేటిక్‌గా మూసుకుంటాయి.
తలుపులు మూత పడే వరకు మెట్రో కదలదు కాబట్టి ఆందోళన చెందవద్దు. తోసుకుని ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు.
ప్రస్తుతానికి ప్రతి 15 నిమిషాలకు ఓ మెట్రో రైలు వస్తుంది.
మొదటి అంతస్తు..
కింది నుంచి చూడటానికి చిన్నగా కనపడినా మొదటి అంతస్తు చాలా విశాలంగా ఉంటుంది. సాధారణ స్టేషన్లలో 50వేల చ.అడుగుల స్థలం ఉంటుంది. 50 ఫ్లాట్లు ఉండే అపార్ట్‌మెంట్‌లో ఉండేంత స్థలం.
మొదటి అంతస్తులోని స్టేషన్‌ను రెండు భాగాలుగా విభజించారు. అటు ఇటు చివర ఉచిత ప్రాంతం. ఎవరైనా రావొచ్చు. పోవచ్చు. మధ్యలో పెయిడ్‌ ఏరియా.. టికెట్‌ ఉన్నవాళ్లకే అనుమతి ఉంటుంది.
ఉచిత ప్రాంతంలోకి అడుగు పెట్టగానే టికెట్‌ కౌంటరు, టికెట్‌ వెండింగ్‌ యంత్రాలు ఉంటాయి. వరసల్లో 10 మంది ఉన్నాసరే నిమిషాల్లో టికెట్‌ తీసుకోవచ్చు.
5 నిమిషాలు: కింది నుంచి మొదటి అంతస్తుకు వచ్చి టికెట్‌ టోకెన్‌ తీసుకుని.. భద్రతా తనిఖీలు ముగించుకుని రెండో అంతస్తులోని ఫ్లాట్‌ఫాంకు చేరుకునేందుకు 5 నిమిషాలు పడుతుంది.
రెండు నిమిషాలు: స్మార్ట్‌కార్డు ఉంటే వేచి ఉండే అవకాశం లేదు కాబట్టి భద్రతా తనిఖీలు ముగించుకుని రెండే నిమిషాల్లో ఫ్లాట్‌ఫాంకు చేరుకోవచ్చు.
స్మార్ట్‌కార్డు కనీస విలువ రూ.200. ఇందులో రూ.100 ధరావత్తు. మిగతా మొత్తం ఛార్జీలకు వినియోగించుకోవచ్చు. రూ.2 వేల వరకు రీఛార్జ్‌ చేసుకోవచ్చు.ఉచిత ప్రాంతం..
టికెట్‌ కౌంటర్‌ వెనక ప్రాంతంలోకి ఎవరికీ అనుమతి ఉండదు. స్టేషన్‌ అవసరాలకు విద్యుత్తు, కమ్యూనికేషన్‌, ఇతర వ్యవస్థలు ఉంటాయి. మధ్యలో దారి ఉంటుంది. మరోవైపు దుకాణాల కోసం కేటాయించారు. రెండు వైపులా ఇదే విధంగా ఉంటుంది.
రెండువైపులా కలిపి 2500 చ.అడుగుల నుంచి 9వేల చ.అ. స్థలం రిటైల్‌ దుకాణాలకు అందుబాటులో ఉంది.
ఒక్కో దుకాణానికి 100 చ.అ.నుంచి 350 చ.అ. వరకు అందుబాటులో ఉన్నాయి.
కొన్ని స్టేషన్లలో లోపలికి, బయటికి వెళ్లే మార్గంలోనూ దుకాణాల ఏర్పాటుకు 1000 చ.అ. నుంచి 2500 చ.అ. స్థలం ఉంది.
వీటిలో ఆహారశాలలు, పుస్తకాల స్టాళ్లు, పండ్లు, కూరగాయల దుకాణాలు, లాండ్రీ, లేడీస్‌ కార్నర్‌, మందుల దుకాణం వంటివన్నీ ఉండబోతున్నాయి.
ఈమార్గంలోనే చివరకువెళితే మరుగుదొడ్లు ఉంటాయి.చెల్లింపు ప్రాంతంలో..
మొదటి అంతస్తులోని ఇక్కడికి ప్రవేశించాక ఒకే నిమిషంలో ్లప్లాట్‌ఫాంపైకి చేరుకోవచ్చు. ఇక్కడ కూడా ఏ, బి, సి, డీ.. దారులు ఉన్నాయి. అన్నివైపులా మెట్లు, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు ఉన్నాయి. ఒక్కోవైపు నుంచి 5 విధాలుగా పైకి చేరుకోవచ్చు.
మధ్యలో విశాలమైన స్థలం ఉంటుంది. వినియోగదారుల సేవా కేంద్రంతో పాటు ప్రాథమిక చికిత్స సదుపాయం ఉన్నాయి. అత్యవసర మార్గం, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంటాయి. ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు ఉంది. వినోద కార్యక్రమాలు, వార్తలను ఇక్కడ వీక్షించవచ్చు.
మధ్య భాగంలో రెండు వందల మందికి పైగా ఉండొచ్చు.
రహదారిపై (స్ట్రీట్‌ లెవెల్‌)
మెట్రో స్టేషన్‌లోకి చేరుకునేందుకు ఎ, బి, సి, డి దారులున్నాయి. మెట్లు, ఎస్కలేటరు, లిఫ్ట్‌ ఇలా 9 విధాలుగా ఉన్నాయి. ఒకవైపు 5, మరోవైపు 4 విధాలుగా స్టేషన్‌లోకి చేరుకోవచ్చు.‘ఏ’ మార్గం.. మెట్లు, ఎస్కలేటరు వ్యతిరేక దిశలో
‘బి’ మార్గం.. మధ్యలో లిఫ్ట్‌, ఎస్కలేటరు
‘సి’ మార్గం.. పక్కపక్కనే మెట్లు, ఎస్కలేటరు, మధ్యలో లిఫ్ట్‌ (ఎలివేటర్‌)
‘డి’ మార్గం… మెట్లు, ఎస్కలేటరు పక్కపక్కనేసూచనలు:
ఏ మార్గం నుంచైనా పైకి వెళ్లవచ్చు.
వృద్ధులు, వికలాంగులు, లగేజీ ఎక్కువ ఉన్నవారు లిఫ్ట్‌ ఉపయోగించవచ్చు. లిఫ్ట్‌లో చక్రాల కుర్చీలు సైతం పడతాయి. సొంతంగా తీసుకెళ్లవచ్చు. స్టేషన్ల వద్ద అందుబాటులో ఉంచుతారు. లిఫ్ట్‌ వరకు చేరుకునేలా అనువుగా ర్యాంపులు నిర్మించారు.
లిఫ్ట్‌లో ఒకేసారి ఆరుగురు ప్రయాణించవచ్చు. మెట్లపై నుంచి పరిమితి లేదు. ఒకేసారి వంద మంది వరకు వెళ్లొచ్చు. ఎస్కలేటర్‌పై 25 మంది వరకు వెళ్లొచ్చు.
ఏకకాలంలో సాధారణ స్టేషన్‌లో వెయ్యి మంది రాకపోకలు సాగించవచ్చు.
రహదారి మధ్యలో ఉన్న వరస స్తంభాల నడుమ విద్యుత్తు అంతరాయాల సమయంలో వినియోగించుకునేలా జనరేటర్‌ ఉంటుంది.
లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన భూగర్భ ట్యాంకుల నుంచి స్టేషన్‌ అవసరాలు, అగ్ని ప్రమాదాల సమయంలో వినియోగించుకునేలా సంపులను స్తంభాల నడుమ, మెట్ల మార్గాల్లో ఏర్పాటు చేశారు.
2 నిమిషాల్లో చేరుకునేలా..
మెట్రోలో ప్రయాణించాలంటే సమీపంలోని స్టేషన్‌కు చేరుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రారంభమయ్యే 30 కి.మీ. మార్గంలో సగటున 1.2 కి.మీ.కు ఒక స్టేషన్‌ వస్తోంది. ఇది రెండు అంతస్తుల్లో ఉంది. రహదారిపై నుంచి మొదలవుతుంది. రెండు నిమిషాల్లో ప్లాట్‌ఫాంపైకి చేరుకునేలా రూపొందించారు.
ధ్యేయం
ప్రయాణ సమయం తగ్గించడం
నగరం పౌరుల కోసమే.. వాహనాల కోసం కాదు
రహదారి నిబంధనలపై ప్రయాణికుల్లో అవగాహన పెంచడం ద్వారా క్రమశిక్షణ
సౌకర్యాలు…
కచ్చితమైన సమయపాలన
సౌకర్యవంతమైన ఏసీ ప్రయాణం
ట్రాఫిక్‌ యాతన నుంచి విముక్తి
వ్యక్తిగత వాహనాలకు విశ్రాంతి
మియాపూర్‌ స్టేషన్‌లో 25 స్మార్ట్‌ బైకులు
అర గంట ఉచితం
ప్రతి మెట్రో స్టేషన్‌ వద్ద సైకిల్‌ స్టేషన్లు రాబోతున్నాయి. ఆరంభంలో మూడు స్టేషన్ల వద్ద మాత్రమే ఏర్పాటు చేయబోతున్నారు. మెట్రో ఆరంభించే మియాపూర్‌ స్టేషన్‌ వద్ద మొట్టమొదటి సైకిల్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నారు. శనివారం సాయంత్రం నాటికి ఈ పనులు పూర్తికానున్నాయి. ఇక్కడ జర్మనీ నుంచి ఇప్పటికే దిగుమతి చేసుకున్న 25 స్మార్ట్‌ బైకులను అందుబాటులోకి ఉంచనున్నారు. కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ వద్ద కూడా ఏర్పాటు చేయనున్నారు. ఫోరం మాల్‌, మియాపూర్‌, జేఎన్‌టీయూ కళాశాల వద్ద ఫీడర్‌ సైకిల్‌ స్టేషన్లు రాబోతున్నాయి. మొదట అరగంటలోపు సైకిల్‌ ఉచితంగా వినియోగించవచ్చు.
అమీర్‌పేటలో మారాల్సిందే..
మెట్రో 30 కి.మీ. ప్రారంభం అవుతున్నప్పటికీ రెండు కూడా వేర్వేరు కారిడార్లు. మియాపూర్‌లో బయలుదేరే మెట్రో అమీర్‌పేట వరకు (13 కి.మీ.) వస్తుంది. నాగోల్‌ నుంచి వచ్చే మెట్రో అమీర్‌పేట(17కి.మీ.) వరకే వస్తుంది. కాబట్టి అమీర్‌పేట దాటి ముందుకు వెళ్లాలంటే మూడు అంతస్తుల్లో నిర్మించిన ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌లో మెట్రో మారాల్సిందే. మియాపూర్‌ నుంచి పై అంతస్తులో ఆగుతుంది. నాగోల్‌ నుంచి వచ్చేది కింది అంతస్తులో ఆగుతుందని గుర్తించాలి.
ఇక్కడ ఏకకాలంలో 6వేల మంది రాకపోకలు సాగించవచ్చు.
ప్రతి మెట్రోలో…
ప్రతి మెట్రోలో మూడు కార్లు ఉంటాయి. బస్సులో మాదిరి ఒకదాని వెనక ఒకటి సీట్ల అమరిక కాకుండా.. ఎదురెదురుగా ఉంటాయి.
ముందున్న కార్‌ సామర్థ్యం 315 మంది. ఇందులో 40 మంది కూర్చుని 315 మంది నిలబడి ప్రయాణించవచ్చు.
మధ్య కార్‌ సామర్థ్యం 344. కూర్చుని 46 మంది.. 298 మంది నిలబడి వెళ్లవచ్చు.
చివరన ఉన్న కార్‌ సామర్థ్యం 315 మంది. కూర్చుని 40 మంది, నిలబడి 315 మంది ప్రయాణించవచ్చు.
సీటు కావాలంటే మధ్య కార్‌ను ఎంపిక చేసుకోవడం మేలు. మొత్తంగా 126 మంది సీట్లలో, 848 మంది నిలబడి.. ఏకకాలంలో 974 మంది మెట్రోలో ప్రయాణం చేయవచ్చు.
సగటు వేగం 33 కి.మీ…
మెట్రోరైలు గరిష్ఠ వేగం 90 కి.మీ. డిజైన్‌ చేశారు. నడిపేది మాత్రం గరిష్ఠంగా 80 కి.మీ. మాత్రమే. ప్రతి 1.2 కి.మీ.కు ఒక స్టేషన్‌ చొప్పున ఉండటంతో సగటున 33 కి.మీ. వేగంతో వెళుతోంది.
ప్రత్యేకతల సమాహారం
పరిసరాలకు అనుగుణంగా స్టేషన్ల అభివృద్ధి
ఒక్కో ప్రాంతంలో.. ఒక్కో ముచ్చట
ఈనాడు, హైదరాబాద్‌
మహా నగర ప్రజల కలల రైలు మెట్రో ప్రారంభ సమయం రానే వస్తోంది. ఎప్పుడెప్పుడు రైలు ఎక్కుతామా…అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపించడం సహజం. మెట్రో రైలే కాదు…స్టేషన్లలో విశేషాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కొన్ని స్టేషన్లలో పరిసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం విశేషం. మియాపూర్‌ నుంచి నాగోలు వరకు మధ్య స్టేషన్ల వద్ద కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏమిటో ఒకసారి చూద్దాం…
మియాపూర్‌.. ప్రత్యేక థీమ్‌
మియాపూర్‌ స్టేషన్‌ను ప్రత్యేక థీమ్‌తో అభివృద్ధి చేశారు. పక్కనే డిపోతో కలిపి ఈ స్టేషన్‌ను తీర్చి దిద్దారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో వెళ్లి అక్కడ కొంత సమయం గడిపేందుకు వీలుగా నిర్మిస్తున్నారు. చెట్లను బొమ్మలతో అలంకరిస్తున్నారు. రైల్వే స్టేషన్‌లో కాకుండా ఒక ఎగ్జిబిషన్‌లో ఉన్నామా అనే అనుభూతిని కల్పిస్తున్నారు. రాహ్‌గిరి కోసం ప్రత్యేకంగా రహదారిని అభివృద్ధి చేస్తున్నారు. చిన్నచిన్న కియోస్కులు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. రుచికరమైన ఆహారం తింటూ ఆనందించడానికి హాకర్‌ జోన్‌, ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు.
విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం…
ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం జేఎన్‌టీయూ పేరుతో మెట్రో స్టేషన్‌ను అభివృద్ధి చేయడం విశేషం. నగరం నలమూలల నుంచి వచ్చే విద్యార్థులు నేరుగా జేఎన్‌టీయూకు చేరుకునేందుకు ఈ స్టేషన్‌ ఎంతో ఉపయోగపడనుంది. వీరితోపాటు చుట్టూ ఉన్న కాలనీలకు ఈ స్టేషన్‌ ద్వారా చేరుకునేందుకు వీలుగా ఉంటుంది. అయితే కళాశాలకు కొంత దూరంలో స్టేషన్‌ ఉండటం వల్ల అక్కడ దిగి మళ్లీ వెనక్కి కొంత దూరం నడిచి రావాలి.
మెట్రో రైతు బజార్‌లు… భరత్‌నగర్‌, ఈఎస్‌ఐ
కార్యాలయాల నుంచి వస్తూ తాజా కూరగాయలు, పండ్లను తక్కువ ధరకు తీసుకెళ్లే వారికి భరత్‌నగర్‌, ఈఎస్‌ఐ స్టేషన్లు అనువుగా ఉంటాయి. భరత్‌నగర్‌ స్టేషన్‌ కిందనే మెట్రో రైతు బజార్‌ అందుబాటులో ఉంది. రైతుల కోసం రిటైల్‌ మార్కెట్‌, వ్యాపారుల కోసం హోల్‌సేల్‌ మార్కెట్‌ను వేర్వేరుగా తీర్చిదిద్దారు. 10-20 నిమిషాలు ఈ స్టేషన్‌లో ఆగి తాజా కూరగాయలు కొని ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఈఎస్‌ఐ స్టేషన్‌కు పక్కనే ఎర్రగడ్డ రైతు బజార్‌ అందుబాటులో ఉంటుంది. ఇక్కడా తక్కువ ధరకే కూరగాయలు, ఆకుకూరలు కొనుక్కోవచ్చు.
శిక్షణ సంస్థల నిలయం.. అమీర్‌పేట
ఇంజినీర్ల నైపుణ్యానికి నిదర్శనం అమీర్‌పేట మెట్రో స్టేషన్‌. ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌గా దీనిని తీర్చిదిద్దారు. అమీర్‌పేట అంటే తొలుత గుర్తుకు వచ్చేవి విద్యా, ఐటీ, ఉద్యోగ శిక్షణ సంస్థలే. నగరంలో విద్యార్థులు ఎక్కడ ఉన్నా…అమీర్‌పేట వస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ వసతి చాలా ఖరీదు. అందుకే శివార్లలో ఉంటూ చాలామంది బస్సు పాసులు తీసుకొని అమీర్‌పేటకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి వారంతా మెట్రోలో దర్జాగా తక్కువ సమయంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చు. అటు నాగోలు ఇటు శిల్పారామం, మియాపూర్‌, సికింద్రాబాద్‌ ఇలా ఏ మూల నుంచైనా మెట్రోలో అమీర్‌పేట చేరుకోవచ్చు.
పిల్లల ఆటపాటలకు… నాగోల్‌
పిల్లల్లో శారీరక శ్రమ తగ్గడం వల్ల చిన్న వయస్సులో అనేక శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో స్టేషన్లలో పిల్లలు ఆడుకునేందుకు అనువుగా సౌకర్యాలను తీర్చి దిద్దుతున్నారు. త్వరలో నాగోల్‌ స్టేషన్‌ పరిధిలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. సైకిల్‌ ట్రాక్‌లు, ఈత కొలను, జారుడు బల్లలు ఇతరత్రా అన్ని రకాల ఆటలు ఆడుకునే విధంగా ఇక్కడ రెండు ఎకరాల్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులు యోచిస్తున్నారు. మెట్రో ప్రారంభమైన కొన్ని నెలల్లో వీటికి రూపకల్పన చేయనున్నట్లు తెలుస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here