అమీర్‌పేట టు మియాపూర్‌..ఇక 20 నిమిషాలే!
నగరంలో అత్యంత రద్దీ మార్గంలో ప్రయాణం సులభం
న్యూస్‌టుడే, కూకట్‌పల్లి
13 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే ట్రాఫిక్‌ ఇబ్బందులేమీ లేకుంటే.. నగర రోడ్లపై కనీసం 60 నిమిషాల సమయం (జేఎన్‌టీయూ అధ్యయనం ప్రకారం) పడుతోంది. ఇక ట్రాఫిక్‌ అంతరాయాలు ఉంటే.. ఈ సమయం రెండు గంటలవుతుందో.. మూడు గంటలవుతుందో చెప్పలేం.

అమీర్‌పేట నుంచి మియాపూర్‌… నగరంలో బాగా రద్దీ ఉండే మార్గాల్లో ఇదొకటి. మైత్రివనం మొదలుకుని జేఎన్‌టీయూ వరకు రోడ్డు కిటకిటలాడుతుంటుంది. గంటకు లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ మార్గంలో వచ్చే వారంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఈ ప్రాంతాల మధ్య ప్రయాణించే వారికి మెట్రో ఎంతో సౌలభ్యంగా ఉంటుందనే చెప్పాలి.

రహదారిపై గంటపైనే..
నగర రోడ్లపై వాహనాలు గంటకు 12 కిలోమీటర్ల దూరం మాత్రమే వెళ్లగలుగుతున్నాయి. ఇది జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నమాట. వాస్తవంగా వాహనాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించే సౌకర్యాలు ఉండాలని రవాణారంగ నిపుణులు అంటున్నారు. రోడ్ల డిజైన్‌ మార్పు, దాటే వారికి ఏర్పాట్లు, ట్రాఫిక్‌ అవాంతరాలను అధిగమించడం ద్వారానే ఇది సాధ్యమని చెబుతున్నారు. ఇక ట్రాఫిక్‌లేని రోడ్లపై వాహనాలు గంటకు 60 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇప్పుడు మియాపూర్‌ నుంచి అమీర్‌పేట వరకు సాధారణంగా దాదాపు గంట సమయం పడుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనరద్దీని బట్టి ఈ సమయం పెరుగుతుంటుంది.

ఎక్కడికక్కడ అవాంతరాలు
ప్రస్తుతం ఈ మార్గంలో వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. అడుగడుగునా అంతరాయాలతో ఎంతో సమయం ట్రాఫిక్‌లోనే గడపాల్సి వస్తోందని వాపోతున్నారు. మియాపూర్‌ నుంచి ప్రారంభిస్తే… మొదట నిజాంపేట జంక్షన్‌ వద్ద వాహనాల వేగానికి కళ్లెం పడుతుంది. ఇక్కడ ఆర్టీసీ బస్సులు, ఆటోలు రోడ్లపై నిలుపుతారు. రాత్రి 9 అయ్యిందంటే ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు తోడై అడుగు ముందుకు కదలాలంటే కష్టంగా మారుతోంది. సుమిత్రానగర్‌, కూకట్‌పల్లి బస్టాపు, మూసాపేట వద్ద రోడ్డు విస్తరణ జరగకపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతాయి. ఎర్రగడ్డ నుంచి అమీర్‌పేట వరకూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మెట్రో రైలు రాకపోకలు ప్రారంభమైతే ఈ ఇబ్బందిని అధిగమించవచ్చని జనం ఆశిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here